నిజామాబాద్, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కార్మికులందరికీ కరువు భత్యం (వీడీఏ) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలు పనిచేస్తున్న అన్ని కేటగిరిల కార్మికులకు కరువు భత్యం (విడిఏ) పెరిగిందని అన్నారు. వినిమాయ ధరల సూచి 1602 నుండి1696 పాయింట్లకి పెరిగిందని తెలిపారు. అంటే 94 పాయింట్లు పెరిగాయని,1994 అగ్రిమెంట్ ప్రకారం పాయింట్‌కు పది పైసలు చొప్పున, 9 రూపాయల 40 పైసలు పెరిగిందని తెలిపారు. ఈ పెరుగుదల ఏప్రిల్ ఒకటో తారీకు 2023 నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. బీడీలు చుట్టే కార్మికులకు 1000 బీడీలకు కరువు భత్యం(విడిఏ) 9.40 పైసలుగాను పెంచి అదికూడా ఏప్రిల్ ఒకటో తారీకు 2023 నుండి అమలు చేయాలని తెలిపారు.
నెలసరి జీతాల ఉద్యోగులైన బీడీ సర్టర్, ఆకు, తంబాకు పంచేవారు, గుమస్తాలకు, అకౌంటెంట్లకు, బట్టి వాల, చెన్నివాల, గంప వాల, వాచ్మెన్లకు నెల ఒక్కింటికి 282 రూపాయల చొప్పున పెంచి ఏప్రిల్ ఒకటో తారీకు 2023 నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ ప్యాకర్లకు ఒక్కరోజు పనికి కరుబత్యం(విడిఏ) తొమ్మిది రూపాయల 40 పైసలు చొప్పున వివిధ రకాల నమున బీడీ ప్యాకింగ్ కలిగిన లక్ష బీడీ ప్యాకింగ్‌కు కరువు భత్యం ఎంత అనేది నిర్ణయించబడుతుందని తెలిపారు.
పెరిగిన కరువు భత్యం రాష్ట్రంలోని ఏడు లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. కాబట్టి పెరిగిన కరువు భత్యంలో(విడిఏ) అమలు చేయించుటకు పోరాడాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) రాష్ట్ర కమిటీ బీడీ కార్మికులందరికీ పిలుపునిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరేందర్, జిల్లా అధ్యక్షులు డి.రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకన్న, జిల్లా నాయకులు సాయరెడ్డి పాల్గొన్నారు.