నిజామాబాద్, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యోగులకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పేగు బంధం ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ అనుబంధాన్నిఎన్నటికీ విడదీయలేరని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మైదానంలో మూడు రోజుల పాటు కొనసాగిన టీఎన్జీవో 34 వ జిల్లా స్థాయి అంతర్ శాఖల క్రీడా పోటీలు శనివారం సాయంత్రం నాటితో ముగిశాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్రీడా పతాకాన్ని అవనతం చేసి పోటీలు ముగిసినట్టు ప్రకటించారు.
వివిధ క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన జట్లను అభినందిస్తూ మెమొంటోలు అందజేశారు. తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం ప్రత్యేకంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం పట్ల టీఎన్జీవో జిల్లా కార్యవర్గానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులు వేరు, తాము వేరు అనే భావన తమ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని, ఇకముందు కూడా అలాంటి ఆలోచన రాదని అన్నారు. ఉద్యోగులకు మంచి చేస్తే, దానివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని బలంగా విశ్వసించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. అందుకే ఉద్యోగులు అడుగకముందే వారికి జీతాలు, పదోన్నతులు, వైద్య సదుపాయాలు వంటి అనేక విషయాల్లో అనుకూల నిర్ణయాలు అమలు చేస్తున్నారని అన్నారు.
దేశంలోనే ఇతర ఏ రాష్ట్రాల్లో లేనివిధంగా తెలంగాణ ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని మంత్రి పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణాలో ఉద్యోగులు ఎంతో నిబద్ధతతో కష్టపడి పని చేస్తుండడం వల్లే ఎనిమిదిన్నరేళ్ళ పసిగుడ్డుగా ఉన్న మన రాష్ట్రం, నేడు అనేక అంశాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా మారిందని హర్షం వెలిబుచ్చారు. 2004 నుండి 2014 వరకు పదేళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడుల కింద కేవలం 57 వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తే, తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 నుండి 2022 వరకు కేవలం ఎనిమిదిన్నరేళ్ళ కాలంలోనే మూడు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని వివరించారు.
స్వరాష్ట్రంలో ఉద్యోగులు ఎంతో ఇష్టంగా కష్టపడి పనిచేయడం వల్లే ఆరు రెట్లు ఎక్కువగా మౌలిక సదుపాయాలపై నిధులు వెచ్చించగలిగామని పేర్కొన్నారు. అలాగే 2014 లో తెలంగాణలో తలసరి సగటు ఆదాయం లక్షా 27 వేల రూపాయలు ఉండగా, ప్రస్తుతం అది 2 .77 లక్షల రూపాయలకు పెరిగిందన్నారు. ఇదంతా ఉద్యోగుల భాగస్వామ్యంతోనే సాధ్యమయ్యిందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభ్యున్నతికి తోడ్పడుతున్న ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి సానుకూల దృక్పధంతో వారికి అనుకూల నిర్ణయాలు చేపడతారని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదని భరోసా కల్పించారు.
త్వరలోనే పీ.ఆర్.సి ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందన్నారు. ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం బడ్జెట్లో ఈ.హెచ్.ఎస్ కు రూ.350 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. కాగా, క్రీడలకు ప్రత్యామ్నాయం వేరే ఏదీ లేదని, కులమతాలు, పేద-ధనిక తేడాలు లేకుండా స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, మనలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తెస్తాయని అన్నారు. జిల్లా స్థాయి అంతర శాఖల క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడం పట్ల టీఎన్జీవో బాధ్యులను అభినందించారు.
ఉద్యోగుల సౌకర్యార్ధం జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన కల్యాణ మండపం స్థలానికి అనుమతులు మంజూరు చేయిస్తానని, భవన నిర్మాణానికి కూడా తనవంతు తోడ్పాటును అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని అన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, టీఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొనడం ప్రశంసనీయమని అన్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా పోటీలలో పాల్గొని తమ క్రీడా స్ఫూర్తిని చాటారని అభినందించారు. అనునిత్యం విధుల్లో నిమగ్నమై ఉండే ఉద్యోగులకు క్రీడలు మానసికోల్లాసాన్ని అందించడంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందిస్తాయని అన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, క్రీడల్లో పాల్గొనే అవకాశం లభించడాన్ని ఎంతో గొప్పగా భావించాలన్నారు. ఉద్యోగులకు క్రీడలు వారి జీవితాల్లో తీపి గురుతులుగా మిగులుతాయని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్, నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎంప్లాయ్ జేఏసి రాష్ట్ర చైర్మన్ మామిళ్ళ రాజేందర్, టిఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్, ప్రధాన కార్యదర్శి అమృత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.