కామరెడ్డి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో అందరితో ట్రాన్స్ జెండర్లు సమానమేనని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి. కిరణ్ కుమార్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, సఖి కేంద్రం ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ట్రాంజెండర్లు చదువుకొని ఉద్యోగాలు పొందాలని సూచించారు. చిన్న, చిన్న వ్యాపారాలు చేపట్టి స్వయం ఉపాధి పొందాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ట్రాన్స్ జెండర్‌లు జీవన భృతి కోసం ఇప్పటివరకు చేస్తున్న కార్యక్రమాలను మానుకొని వస్తే నైపుణ్య శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ట్రాన్స్ జెండర్లకు కలిగే అసౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవ సంస్థ ద్వారా సత్వర న్యాయం లభిస్తుందని చెప్పారు. సఖి కేంద్రం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ పర్యవేక్షకుడు చంద్రసేనారెడ్డి, సఖి కేంద్రం ముఖ్య పరిశీలకురాలు భారతి, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు, ట్రాన్స్ జెండర్లు, మహిళలు పాల్గొన్నారు.