నందిపేట్, ఫిబ్రవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని ఖుదావంద్ పూర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1976-77 నుండి 1986- 87 వరకు 11 బ్యాచుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దాదాపు 236 మందికి గాను 180 మంది ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఉదయం 9 గంటలకు ప్రాథమిక పాఠశాల ఆవరణకు చేరుకుని ముందుగా సరస్వతీ మాతకు పూజా కార్యక్రమం నిర్వహించి టాపులేని జీబులో గురుదేవులను కూర్చోబెట్టి ర్యాలీ రూపంలో పాదయాత్రగా ఉన్నత పాఠశాల వరకు గురువులు పూర్వ విద్యార్థులు చేరుకున్నారు.
అల్పాహారాన్ని స్వీకరించిన తర్వాత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆదర్శ విద్యార్థి రూపకాన్ని జింధం నరహరి ఆధ్వర్యంలో ప్రదర్శించారు. గురువులను వేదికపై ఆహ్వానించి శిష్యులు అప్పటి గత స్మృతులను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత గురువులు మాట్లాడుతూ అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకొని 35-45 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకొని ఆహ్వానించి సన్మానించడం చాలా గొప్ప విషయమని విద్యార్థులను కొనియాడారు.
తర్వాత ఒక్కొక్క బ్యాచ్ వారు వచ్చి ఒక్కొక్క ఉపాధ్యాయుని పూలమాల, శాలువ, ప్రత్యేకంగా తయారు చేయించిన జ్ఞాపికలతో 16 మందిని, పరమపదించిన 6 గురు గురువుల సతీమణులను సన్మానించారు. కొసమెరుపుగా విద్యార్థులందరికీ జ్ఞాపికలు, అప్రిసియేషన్ సర్టిఫికెట్లు ఆశీర్వచనాలతో అందజేశారు. 35-45 సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని, గురువులు శిష్యులందరినీ కొనియాడారు. పూర్వ విద్యార్థులు గురువులను ప్రత్యక్షంగా చూసిన అనుభూతితో పాద పద్మాలకు ప్రాణమిల్లి గురువుల సేవలను కొనియాడారు. వందనసమర్పణతో కార్యక్రమం ముగించారు.