నిజామాబాద్, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొని రోడ్డు ప్రమాదాలపై చర్చించారు.
జిల్లా మీదుగా రెండు ప్రధాన జాతీయ రహదారులు వెళ్తుండడం వల్ల తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నందున, వాటికి ఆస్కారం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్ స్పాట్లుగా పరిగణిస్తూ, ప్రమాదాలకు దారి తీస్తున్న పరిస్థితులను గల కారణాలను గుర్తించాలన్నారు.
పోలీస్, ఆర్ అండ్ బీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ జాయింట్ సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో ప్రాంతం వారీగా సునిశిత పరిశీలన జరపాలన్నారు. ప్రమాదాలకు మూల మలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వంటి కారణాలను గమనిస్తే, వాటిని వెంటనే సరి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్లు సహా, ఇతర ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లకు రోడ్డు భద్రతా చర్యలు విధిగా పాటించేలా నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాల్లోనూ ముఖ్య కూడళ్లు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
డివైడర్లు, ఐలాండ్ల వల్ల ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయా అన్నది గుర్తించాలన్నారు. నగరంలో వాహనాల పార్కింగ్ కోసం అనువైన ప్రదేశాలను గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, వివిధ శాఖల అధికారులు, రెడ్ క్రాస్ ప్రతినిధి బుస్సా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.