బాన్సువాడ, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ, జూక్కల్ ప్రాంత ప్రజల బాన్సువాడ జిల్లా ఏర్పాటు కోరికను బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ఏర్పాటు ప్రకటన చేయాలని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాసుల బాలరాజ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బాన్సువాడ జిల్లా ఏర్పాటు కొరకు అఖిలపక్ష నాయకులు, ప్రజలు, విద్యావంతులు, విద్యార్థులతో కలిసి 108 రోజులు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందని పలుమార్లు రెవిన్యూ డివిజన్ అధికారులకు ఉన్నత అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ జిల్లా ఏర్పాటుపై చలనం లేదన్నారు. పరిపాలన సౌలభ్యం కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు మండలాలు ఏర్పాటు చేయడం స్వాగతించామని అదేవిధంగా బాన్సువాడ జిల్లా ఏర్పాటయితే బాన్సువాడ పరిపాలన సౌలభ్యపరంగా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని విద్య వైద్య రంగాల్లో బాన్సువాడ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ వెంకటేశ్వర క్షేత్రానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ఏర్పాటు ప్రకటన చేయాలని బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గ ప్రజలు బాన్సువాడ జిల్లా ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియజేసే విధంగా ఫ్లకార్డులతో ప్రదర్శన చేయాలన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ జిల్లా ఏర్పాటుపై ముఖ్యమంత్రితో ప్రకటన చేయిస్తే బాన్సువాడ జూకల్ నియోజకవర్గ ప్రజలు జీవితాంతం పోచారం శ్రీనివాస్ రెడ్డిని గుర్తు పెట్టుకుంటారన్నారు.
కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, కిసాన్ కేత్ అధ్యక్షులు హన్మండ్లు, పార్టీ పట్టణ మండల అధ్యక్షులు మాసాని శేఖర్ రెడ్డి, మంత్రి గణేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజీమ్, సాహబ్, నార్ల రాఘవేందర్, బిట్ల సూరి, గంగాధర్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.