నిజామాబాద్, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి నాలుగవ తేదీన ‘‘నైతికత – మానవ విలువలు’’, ఆరవ తేదీన ‘‘పర్యావరణ విద్య’’ పరీక్షలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. ఇంటర్ విద్య కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని 116 జూనియర్ కళాశాలలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
అన్ని కళాశాలల ప్రిన్సిపాల్‌లు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదివరకే జవాబు పత్రాలను అన్ని పరీక్ష కేంద్రాలకు పంపించడం జరిగిందని, ప్రశ్నపత్రం అదేరోజు నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులందరికీ హాల్ టికెట్లు ఇవ్వడం జరిగిందని ఈ పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థిని, విద్యార్థులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా ఆయా కళాశాల ప్రిన్సిపాల్‌లు విద్యార్థులను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రతి విద్యార్థి కూడా వార్షిక పరీక్షలకు హాజరై కచ్చితంగా పరీక్ష రాయాల్సి ఉంటుందని తెలియజేశారు. వచ్చే వార్షిక పరీక్షల లో పరీక్షలు అన్ని ఉత్తీర్ణులైనప్పటికీ ఈ రెండు పరీక్షలకు హాజరుకానట్టయితే ఫెయిల్ మేమో వస్తుందని తెలిపారు. కావున ప్రతి కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యాలు ఈ రెండు పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో ఈ రెండు పరీక్షల నిర్వహణకు 116 పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాటు చేశామని అన్నారు. మొత్తం 17,503 విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని, వీరిలో జనరల్ విద్యార్థులు 15,215 ఒకేషనల్ విద్యార్థులు 2,288 మంది హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ , ప్రైవేట్, ఎయిడెడ్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలు, మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, కేజీబీవీ జూనియర్ కళాశాలలు ఇతర అన్ని కళాశాలలో ఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.