రెంజల్, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామానికి చెందిన ఓ వివాహిత సోమవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో స్లాబ్ లో ఉన్న ఇనుప కొండికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
గ్రామానికి చెందిన భీమారాజుకు బాల్కొండ మండలానికి చెందిన ఎత్తం రజితతో 12 ఏళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి అరవింద్ (11), శివకుమార్ (9) కుమారులు ఉన్నారు. వివాహమైన కొన్నేళ్ల వరకు భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పార్ధాలు రాలేవు. ఆ తర్వాత అదనపు కట్నం తీసుకురావాలంటూ తరచుగా శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేసేవాడని చెప్పారు.
విషయంపై పలుమార్లు పంచాయితీ నిర్వహించి మందలించినా భర్త తీరులో మార్పు రాలేదని అన్నారు. వేధింపులు భరించలేక సోమవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. అదే రాత్రి ఆమె పెద్ద కుమారుడు నిద్రలో నుండి చూసి కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వారు అక్కడికి చేరుకొని వివాహితను కిందికి దించేలోపే మరణించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించినట్లు పేర్కొన్నారు. మృతురాలి తల్లి ముత్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.