నిజామాబాద్, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధానమంత్రి మోడీ పేద ప్రజల కడుపు కొడుతూ తన స్నేహితులైన ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్నారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గ్యాస్ ధరలు గడియ గడియకు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని, ఆడ బిడ్డలకు మరింత భారంగా మార్చుతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ మళ్ళీ ఆడబిడ్డలు కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయని, కేంద్రం గ్యాస్‌పై ధరలు పెంచటం సిగ్గు చేటన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయినపుడు రూ. 410 ఉండే ఆయన ప్రధాని అయ్యాక 13 సార్లు సిలిండర్ ధరలు పెంచారన్నారు.
2014 మన్మోహన్ సింగ్ రూ.50 పెంచితే బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ నాడు తప్పుబట్టింది. ఇప్పుడు అదే స్మృతి ఇరానీ, మోడీలు రూ. 750 పెంచారుని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దేశంలో ఉన్న 30 కోట్ల ఆడ బిడ్డలకు ఇబ్బందిగా మారిందని, కేవలం రూ. 35 వేల కోట్లు సబ్సిడీ ఇస్తే గ్యాస్ ధరలు పెరగవని అన్నారు. సిలిండర్ ధర రూ. 450 మాత్రమే ఉంటుందని, మోడీ స్నేహితుడు ఆదానికి 35 వేల కోట్ల రూపాయలు మాఫీ చేశారని ప్రశ్నిస్తే సిబిఐ కేసులు వేస్తున్నారని తెలిపారు.
లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటిందని, నెలకు పెట్రోల్ మీద ఒక వ్యక్తి కి 1500 భారం పడుతుందని, వంట గ్యాస్ మీద 750 రూపాయలు ఒక వ్యక్తి మీద దోచేస్తున్నారని ఆరోపించారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచటం వల్ల అదాని, అంబానిలకు మాత్రమే ప్రయోజనం చేస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ 2 వేలు ఫించన్ ఇస్తే నరేంద్ర మోడీ మన నుంచి 4 వేలు దోచుకెళ్తున్నాడన్నారు. సిలిండర్ మీద రూ. 35 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేసారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.