బీర్కూర్, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి వాటిలోని విలువైన రాగి తీగలు, ఆయిల్ చోరీలకు పాల్పడిన ముఠా బాన్సువాడ నియోజకవర్గంలో తిరుగుతున్నట్లు సమాచారం. బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానం ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవ వేడుకల్లో ట్రాన్స్‌కో అధికారులు, పోలీస్‌లు నిమగ్నం కాగా, ఇదే అదునుగా చూసుకొని ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు బీర్కూర్ మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న 8 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి వాటిలో ఉన్న రాగి, ఆయిల్ చోరీలకు పాల్పడ్డారు.
ఈ ప్రాంతంలో ఇలాంటి దొంగతనం జరగడం ఇదే మొదటిసారి. ట్రాన్స్కో అధికారులు అందరూ ఆలయం వద్ద విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా అక్కడే విధులు నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న దొంగలు ఈ ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడినట్లు తెలుస్తుంది. సంఘట తెలుసుకుని ట్రాన్స్కో డిఈ కామేశ్వర్ రావు, ఏడిఈ శ్రీనివాసరావు, ఏఈ రాంప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.
8 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి వాటిలో విలువైన రాగి, ఆయిల్ చోరీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ తొమ్మిది లక్షల రూపాయల పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు బీర్కూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకటే రాత్రి ట్రాన్స్ఫార్మర్‌లను పగలగొట్టి పెద్ద ఎత్తున విలువైన రాగి ఆయిల్‌ను దొంగలు నుంచి పోయిన దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇదిలా ఉండగా పొట్ట దశలో ఉన్న వరి పైరులు ఎండకుండా విద్యుత్ అధికారులు తక్షణం ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయాలని మంజీరా ప్రాంత రైతులు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారుల విజ్ఞప్తి మేరకు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తామని డిఈ కామేశ్వరరావు రైతులకు భరోసా కల్పించారు.