రెంజల్, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు చదువుతో పాటు తల్లిదండ్రులను గౌరవించాల్సిన బాధ్యత ఉండాలని మండల విద్యాశాఖాధికారి గణేష్ రావు అన్నారు. గురువారం మండలంలోని సాటాపూర్‌లోని యూనీక్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.
సంస్కృతి, సాంప్రదాయాలు దేశభక్తిని చాటే నృత్యాలు చేసి చూపరులను అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంఈఓ గణేష్ రావు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి చక్కగా చదువుకొని రాణించినప్పుడే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రుల శ్రమ వృధా కాకుండా చూడాల్సిన అవసరం ఉపాధ్యాయులపై ఉందన్నారు.
తల్లిదండ్రులను గౌరవించే దిశగా విద్య బుద్ధులు నేర్పాలని అన్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ముఖ్య అతిథులను సన్మానించారు. సమావేశానికి పాఠశాల ప్రిన్సిపల్ యూసుఫ్ అధ్యక్షత వహించారు. వార్షికోత్సవంలో బిఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు హజీఖాన్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య కమిటీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, విఠల్ రావు, రాజశేఖర్ గౌడ్, సద్దాం, నాయకులు మూసాఖాన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు.