ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 15 నుండి ఏప్రిల్‌ 4 వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుండగా, పదవ తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 3 నుండి 12 వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 .30 గంటల నుండి మధ్యాహ్నం 12 .30 గంటల వరకు జరుగనున్నాయి.

10 వ తేదీన జరిగే ఎస్సెస్సి సామాన్య శాస్త్రం (పార్ట్‌-1 ఫిజికల్‌ సైన్స్‌, పార్ట్‌-2 బయోలాజికల్‌ సైన్స్‌) పరీక్ష ఉదయం 9 .30 నుండి మధ్యాహ్నం 12 .50 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.

పదవ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 21,707 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, వీరిలో 21590 మంది రెగ్యులర్‌ విద్యార్థులు ఉండగా, 117 మంది ప్రైవేట్‌ అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ కోసం 138 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. అదేవిధంగా ఇంటర్మీడియేట్‌ పరీక్షలకు మొత్తం 35017 మంది హాజరు కానున్నారని తెలిపారు. వీరిలో 4354 మంది ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించిన విద్యార్థిని, విద్యార్థులు ఉన్నారని అన్నారు. ఇంటర్‌ పరీక్షల కోసం జిల్లాలో 54 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

పరీక్ష ప్రారంభం అయ్యే నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని హితవు పలికారు. ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాలను ఆయా రూట్‌ ల వారీగా పోలీసు బందోబస్తు మధ్య తీసుకెళ్లాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ, తగిన పోలీసు బందోబస్తు ఉండేలా చూడాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్‌ సెంటర్‌ లను మూసిఉంచాలని ఆదేశించారు.

ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏ ఎన్‌ ఎం లను ఎగ్జామ్‌ సెంటర్లలో నియమించాలన్నారు. వేసవి తీవ్రత అంతకంతకు పెరుగుతున్న దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో ఓ ఆర్‌ ఎస్‌ ప్యాకెట్లను, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, అత్యవసర సమయంలో వినియోగించేందుకు వీలుగా 108 అంబులెన్సు సిబ్బందిని కూడా అప్రమత్తం చేయాలని సూచించారు.

కోవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చూడాలని, ఎగ్జామ్‌ సెంటర్స్‌ లోని గదులను శానిటైజెషన్‌ చేయాలన్నారు. ప్రతి కేంద్రంలోను సరిపడా బెంచీలు, డ్యూయల్‌ డెస్క్‌ లు ఇతర ఫర్నీచర్‌ అందుబాటులో ఉంచాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని సదుపాయాలూ కల్పించాలని అన్నారు. పరీక్షలు కొనసాగే సమయాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

గదుల్లో తగినంత వెలుతురు, సీలింగ్‌ ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు ప్రారంభం కాకముందే పరీక్షా కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత మండలాల ఎంపీడీఓలు ఎగ్జామ్‌ సెంటర్‌ లను సందర్శించి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రత్యేకించి మారుమూల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలలో సీ.సీ కెమెరాల పనితీరును ముందుగానే పరిశీలించుకోవాలని, ప్రశ్న పత్రాల బండిళ్లను సీ.సీ కెమెరాల రికార్డింగ్‌ నడుమ సీల్‌ విప్పాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను అనుమతించనందున విద్యార్థులు సెల్‌ ఫోన్స్‌, క్యాలిక్యులేటర్‌, స్మార్ట్‌ వాచ్‌ వంటివి వెంట తేకూడదని హితవు పలికారు.

ఇన్విజిలేటర్‌ లు కూడా పరీక్ష కేంద్రం లోపల సెల్‌ ఫోన్‌ వాడకూడదని అన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన నియమ,నిబంధనలపై ముఖ్య పర్యవేక్షకులు, డిపార్ట్మెంటల్‌ అధికారులు, ఇన్విజిలేటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు శిక్షణ ఏర్పాటు చేయాలని ఎస్‌ ఎస్‌ సీ, ఇంటర్‌ అధికారులను ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అదనపు కలెక్టర్‌ సూచించారు.

సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి రఘురాజ్‌, డీ ఈ ఓ దుర్గా ప్రసాద్‌, పరీక్షల విభాగం సహాయ కమిషనర్‌ విజయ్‌ భాస్కర్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుదర్శనం, డీపీఓ జయసుధ, ఎంహెచ్‌ఓ సాజిద్‌, కలెక్టరేట్‌ పరీక్షల విభాగం సూపరింటెండెంట్‌ పవన్‌, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »