నిజామాబాద్, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, డీ పీ ఓ జయసుధ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండిరగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయడంతో పాటు అర్జీదారులకు సమాచారం అందించాలని సూచించారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులే విధిగా ప్రజావాణికి హాజరు కావాలని, ఒకవేళ అత్యవసరంగా రాలేని పరిస్థితి ఉంటే జిల్లా పాలనాధికారి అనుమతి తీసుకోవాలని సూచించారు.
ఉపాధి హామీ కూలీలకు సదుపాయాలు కల్పించాలి
కాగా, వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు నిర్వహిస్తున్న కూలీలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు సూచించారు. పని ప్రదేశాల్లో తప్పనిసరిగా తాగు నీటి వసతి, నీడను కల్పించేలా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఈ నెల 8 న ప్రారంభించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని, స్థానిక శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు.
అదేవిధంగా ఈ నెల 13 వ తేదీన సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని అన్నారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని, ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.