నిజామాబాద్, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో స్థానిక ఎస్.వి. డిగ్రీ కళాశాలలో కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభోపన్యాసం చేసిన జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్రం యువతలో నైపుణ్యాభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు.
మూడు సెషన్లుగా జరిగిన కార్యక్రమంలో మొదటి సెషన్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ రాచయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతకు అందిస్తున్న పథకాలను, ఉచితంగా అందిస్తున్న వివిధ కోర్సులను సవివరంగా తెలిపారు. రెండవ సెషన్‌లో డిచ్‌పల్లి లోని స్టేట్ బ్యాంక్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సెంటర్ ఉచితంగా అందిస్తున్న 3 నెలల షార్ట్ టర్మ్ కోర్సులను మహిళలకి, పురుషులకు అందిస్తున్న మెకానిక్, ఎంబ్రాయిడరీ లాంటి ఎన్నో ఉపాధి అవకాశాలను వివరించారు.
3వ సెషన్ తీసుకున్న గిరిరాజ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ తుంటి దేవన్న మాట్లాడుతూ కెరీర్ పట్ల సంపూర్ణ అవగాహనతో ముందుకెళ్లాలని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అంబోజి హరిప్రసాద్, శ్రీనివాస్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.