నిజామాబాద్, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా, నగర ప్రజలకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్ నగరానికి అతి చేరువలో మల్లారం వద్ద జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పరంగా నెలకొల్పడిన ధాత్రి టౌన్‌షిప్‌లో అతితక్కువ ధరలకే నివాస స్థలాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని అనుమతులు, డీటీసీపీ అప్రువుడ్ లేఅవుట్ కలిగిన ధాత్రి టౌన్ షిప్‌లో ఇంటి స్థలం కొని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటు ధరకే ‘ధాత్రి’లో ఇంటి స్థలం కొనే సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా మోడల్ టౌన్ షిప్ రూపుదిద్దుకుంటోందని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. సువిశాలమైన 60 ఫీట్ల అప్రోచ్ రోడ్డు, 30 నుండి 40 ఫీట్ల విస్తీర్ణంతో కూడిన అంతర్గత రోడ్లు, ప్రభుత్వ పరంగా నీటి వసతి, విద్యుత్ సరఫరా, సి.సి డ్రెయిన్లు, ఎస్.టీ.పి, టౌన్ షిప్ చుట్టూ ప్రహరీ నిర్మాణం జరిపిస్తున్నామని అన్నారు.
ధాత్రి టౌన్ షిప్ నుండి కేవలం 9 కీ.మీ దూరంలో నిజామాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వేస్టేషన్ ఉందని అన్నారు. 76 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో వివిధ సైజులలో మొత్తం 316 ప్లాట్లు టౌన్ షిప్‌లో అందుబాటులోకి రానున్నాయని వివరించారు. తొలి విడతలో 80 ప్లాట్ల అమ్మకాల కోసం గత నవంబర్ 14న బహిరంగ వేలం నిర్వహించామని కలెక్టర్ గుర్తు చేశారు.
ప్రస్తుతం రెండవ విడతగా ఈ నెల 16న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్)లో బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందన్నారు. చదరపు గజం ప్రారంభ ధర కేవలం 6 వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ధాత్రి టౌన్ షిప్ ప్రత్యేకతలు తెలియజేసేందుకు, ఔత్సాహికుల సందేహాలు నివృత్తి చేస్తూ ముందస్తు అవగాహన కల్పించేందుకు ఈ నెల 10వ తేదీన శుక్రవారం ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్‌లో ప్రి-బిడ్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.