కామారెడ్డి, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో శుక్రవారం ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతి ఇవ్వబోరని చెప్పారు. ఇంటర్ పరీక్షల కోసం ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, పరీక్షల విభాగం అధికారులు అజ్మల్ ఖాన్, నిజాం పాల్గొన్నారు.