నిజామాబాద్, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన దేశ యువతే మన దేశపు బలము,భవిష్యత్తు అని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు ప్రజల కోసమే పని చేస్తాయని, ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలే అని కనుక ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో జన్మించడం మనందరికీ గర్వకారణమన్నారు, ప్రభుత్వాలు అందిస్తున్న ఎన్నో పథకాలను ప్రజలు, ముఖ్యంగా యువతీయువకులు వినియోగించుకోవాలని సూచించారు.
ఆత్మీయ అతిథిగా హాజరైన బోధన్ ఆర్డీవో రాజేశ్వర రావు మాట్లాడుతూ యువతీయువకులు చదువుతోపాటు క్రీడలు, నైపుణ్యాభివృద్ధి విషయాలలో అవగాహన పెంచుకోవాలని, తద్వారా మన దేశ యువత మరింత శక్తివంతమైన దేశంగా మన దేశాన్ని మార్చగలరని కోరారు. కార్యక్రమానికి అధ్యక్షోపన్యాసం చేసిన జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ కేంద్ర ప్రభుత్వం యువతకు అందిస్తున్న ప్రథకాలను వివరించారు. ఈ సంవత్సరం సిరి ధాన్యాల సంవత్సరంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారని మనమందరం సిరి ధాన్యాలను మన నిత్యజీవితంలో ఆహారంగా చేర్చుకోవాలని, తద్వారా మన ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.
జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ రాచయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి కోర్సులను వివరించారు. కార్యక్రమంలో మిగతా వక్తలు జీ 20 సమావేశాలకు భారత్ అధ్యక్షత విహించబోతున్న విషయాన్ని వివరించారు, యువతీయువకులు మాక్ పార్లమెంట్ సెషన్ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రంగారత్నం, వ్యవసాయ శాఖ అధికారి వాజీద్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, సామాజిక కార్యకర్త పద్మా సింగ్ తదితరులు పాల్గొన్నారు.