కామారెడ్డి, మార్చ్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలోని అన్ని వర్గాల పట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని స్థానిక బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా విద్యార్థి ఉద్యమ నాయకుడు చందు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ నేడు తెలంగాణ ఉద్యమకారులుగా ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని విద్యార్థులు యువత రైతులు నిరుద్యోగులతో పాటు ఉద్యోగుల సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న గురుకులాల్లో సైతం ప్రతి పది రోజుల్లో ఏదో ఒకచోట భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని వసతి గృహాల విద్యార్థులు పాముకాటుకు గురై ప్రాణాలను కోల్పోతున్నా ప్రభుత్వానికి బిఆర్‌ఎస్ నాయకులకు పెద్ద విషయంగా కనిపించడం లేదని కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయని, మెడికో స్థాయి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ర్యాగింగ్ భూతానికి విద్యార్థినిలు బలి కావాల్సి వస్తున్నా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.
ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉంటే మరొకవైపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదని ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎన్నికలవేళ ప్రజలను మభ్యపెట్టి మిగతా సమయంలో ప్రజల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణతో అహంకారంతో వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆయన వ్యవహార శైలిని చూస్తుంటే గెలిపిస్తున్న ప్రజలను ఆశక్తులుగా భావిస్తున్నట్లు అనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విద్యారంగ విధానాలను నిరసిస్తూ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రజలతో వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ విద్యార్థులు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే క్రమంలో రేపటి రోజున దార్శనికతో ప్రజలను అక్కున చేర్చుకునే నాయకత్వం కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కావాలనే ఉద్దేశంతో మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనమండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబ్బీర్ అలీ సమక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి, యువజన లోకంతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి ఉద్యమ నాయకులు రాజశేఖర్, సతీష్, వంశీ, రణదీప్, కృష్ణ, ప్రశాంత్, తేజ తదితరులు పాల్గొన్నారు.