నిజామాబాద్, మార్చ్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల పురోగతి పై నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ ల వారీగా కలెక్టర్ సమీక్షించారు.
బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో చార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని హితవు పలికారు. సామాజిక బహిష్కరణలు విధిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్ధిక సహాయాన్ని సకాలంలో అందేవిధంగా చూడాలన్నారు. పెండిరగ్ ట్రయల్ కేసుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.
అట్రాసిటీ కేసుల్లో నిందితులు తప్పించుకోకుండా వారికి తగిన శిక్షపడేలా పూర్తి ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పించాలని అన్నారు. కాగా, విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని, తద్వారా సమస్యలు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. కమిటీలోని అనధికార సభ్యులు కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని, క్షేత్ర స్థాయిలో అట్రాసిటీ అంశాలతో ముడిపడి ఉన్న సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తమ దృష్టికి తేవాలని అన్నారు. ప్రతీ నెల తప్పనిసరిగా గ్రామాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించేలా చూడాలని హితవు పలికారు.
పోలీస్ కమిషనర్ కెఆర్.నాగరాజు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు పోలీస్ శాఖ తరపున బాధితులకు తప్పనిసరిగా పూర్తి న్యాయం జరిపించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇటీవలి కాలంలోనే రెండు కేసుల్లో సమగ్ర సాక్ష్యాధారాలతో ఫైల్ చేసిన చార్జిషీట్ ఆధారంగా న్యాయస్థానం నిందితులకు శిక్షలు విధించిందని తెలిపారు.
సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిణి శశికళ, ఏ సీ పీలు కిరణ్ కుమార్, ప్రభాకర్, కిరణ్ ఆర్డీవోలు రవి, శ్రీనివాస్, డీ టీ డబ్ల్యు ఓ నాగూరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రషీద్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు, విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.