డిచ్‌పల్లి, మార్చ్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు, క్రీడల శాఖ, ఎన్‌ఎస్‌ఎస్ రీజినల్ డైరెక్టర్ హైదరాబాద్ సూచనల మేరకు, స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ 2022-23 పథకంలో భాగంగా బహిరంగ ప్రదేశాలలో ఒకరోజు సామూహిక స్వచ్ఛత కార్యక్రమాన్ని ఆర్మూర్ బస్టాండ్‌లో నిర్వహించినట్లు ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్, సిద్ధార్థ, నరేంద్ర డిగ్రీ కళాశాలలకు చెందిన 200 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర యువజన అధికారి సైదా నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొని సామాజిక సేవ చేయడం అదృష్టమని, ఎంతోమంది వాలంటీర్లు ఉన్నత పదవులలో ఉన్నారని తెలిపారు.
ఎన్‌ఎస్‌ఎస్‌లో వివిధ కార్యక్రమాల ద్వారా సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత కార్యక్రమాల వల్ల ప్రజలలో అవగాహన పెరుగుతుందని మంచి ఆరోగ్య సమాజం ఏర్పడుతుందని తెలిపారు. సమాజానికి సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ విధిగా బాధ్యత తీసుకోవాలని కోరారు. అవకాశం కల్పించిన రీజినల్ డైరెక్టర్ రామకృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ యాదవ్, ప్రోగ్రాం అధికారులు రాకేష్, గంగాధర్,రాజశేఖర్, వెంకటేశ్వర్లు, యాదగిరి, అధ్యాపకులు, జూనియర్ అసిస్టెంట్ సురేష్ పాల్గొన్నారు.