నిజామాబాద్, మార్చ్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్ షిప్‌లో ప్లాట్ల విక్రయాల కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో రెండవ విడతగా నిర్వహించిన బహిరంగ వేలం ప్రక్రియ శనివారం సాయంత్రం నాటితో ముగిసింది. మొదటి రెండు రోజులు 100 ప్లాట్లకు సంబంధించిన వేలం ప్రక్రియ కొనసాగగా, శనివారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో మిగతా 50 ప్లాట్లకు ఓపెన్ ఆక్షన్ నిర్వహించారు.
టీఎస్‌ఐఐసి ఆధ్వర్యంలో ధాత్రి టౌన్ షిప్‌లో సుమారు పది కోట్ల రూపాయలు వెచ్చిస్తూ విశాలమైన రోడ్లు, విద్యుత్, నీటి వసతి, డ్రైనేజీలు, ఎస్.టీ.పీ వంటి సౌకర్యాలను కల్పించనుండడంతో ఔత్సాహికులు ఉత్సాహంగా వేలం పాటలో పాల్గొన్నారు. డీటీసీపీ అప్రూవ్డ్ లేఔట్ కలిగిన వెంచర్ కావడం, ఎలాంటి చిక్కులు లేకుండా ప్రభుత్వమే ప్లాటింగ్ చేయడం, నిజామాబాద్ నగరానికి చేరువలో ఉండడంతో తమకు నచ్చిన ప్లాట్లను కొనుగోలు చేసేందుకు పలువురు బిడ్డర్లు ఆసక్తి కనబరిచారు.
ప్రభుత్వం చదరపు గజానికి ప్రారంభ ధర ఆరు వేల రూపాయలుగా నిర్ణయించగా, పోటాపోటీగా అంతకంటే ఎక్కువ ధర పాడి వేలంలో ప్లాట్లు దక్కించుకున్నారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, బిడ్డర్ల నుండి ఈ.ఎం.డీ ధరావత్తు పది వేల రూపాయల డీ.డీ ని స్వీకరిస్తూ, టోకెన్లు, దరఖాస్తు ఫారాలు అందించారు. ఒక్కో ప్లాట్ వారీగా అధికారులు నిబంధనలను అనుసరిస్తూ వేలం ప్రక్రియను నిర్వహించారు. అధిక ధర పాడిన వారికి ప్లాట్ ఖరారైనట్లు ప్రకటిస్తూ కేటాయింపు లేఖలు అందజేశారు. వారం వ్యవధిలో 33శాతం మొత్తాన్ని, 45 రోజుల్లో మరో 33 శాతం రుసుమును, 90 రోజుల్లో మిగతా మొత్తాన్ని చెల్లించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు.
ముందుగా ప్రకటించిన మేరకు ధాత్రి టౌన్ షిప్‌లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి స్పష్టమైన భరోసా కల్పించారు. వేలంలో పాల్గొని ప్లాట్లు దక్కించుకున్న వారికి అభినందనలు తెలిపారు. ధాత్రి టౌన్ షిప్ ను అన్ని అధునాతన వసతులు సమకూరుస్తూ, మోడల్ లేఔట్‌తో కూడిన గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. వేలం ప్రక్రియలో టీఎస్‌ఐఐసి జిల్లా మేనేజర్ దినేష్, తహసీల్దార్లు సుదర్శన్, అనిల్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, సూపరింటెండెంట్లు రషీద్, సూర్య తదితరులు పాల్గొన్నారు.