నిజామాబాద్, మార్చ్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నవీపేట మండలంలోని అభంగపట్నం, అబ్బాపూర్ గ్రామాలలో జీ.పీల ఆధ్వర్యంలో నెలకొల్పిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు.
నవీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం స్కూళ్లలో మన ఊరు-మన బడి పనులను తనిఖీ చేశారు. అభంగపట్నం వద్ద ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలను పలకరించిన జిల్లా పాలనాధికారి, వారికి రోజువారీగా సగటున ఏ మేరకు వేతనం సమకూరుతోందని ఆరా తీశారు.
నర్సరీలను క్షేత్రస్థాయిలో సందర్శించిన సందర్భంగా వివిధ రకాల మొక్కల పెంపకం తీరును పరిశీలించారు. విత్తనాలు ఎక్కడి నుంచి సేకరించారు, మొలకెత్తిన మొక్కల శాతం ఎంత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు మరో రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున నిర్ణీత గడువు లోపు మొక్కలు అందించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని నర్సరీల నిర్వాహకులను ఆదేశించారు.
నర్సరీల నిర్వహణను నిశితంగా పర్యవేక్షించాలని మండల అధికారులకు సూచించారు. మొలకెత్తని విత్తనాల స్థానంలో ఇతర మొక్కలు పెంచాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటినుండే అన్ని విధాలుగా సన్నద్ధం కావాలన్నారు. ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్, హాజరవుతున్న కూలీల సంఖ్య, చేపడుతున్న పనులవివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
విరివిగా పనులను గుర్తిస్తూ, పెద్ద ఎత్తున కూలీలకు ఉపాధి కల్పించాలన్నారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు తో కలిసి నవీపేటలోని పాఠశాలల్లో కొనసాగుతున్న మన ఊరు-మన బడి పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. నాణ్యతతో పనులు జరిపిస్తూ, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. పూర్తయిన పనులకు వెంటదివెంట ఎఫ్.టీ.ఓ జెనరేట్ చేసి, సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ చందర్, డీఈఓ దుర్గాప్రసాద్, ఎంపీడీఓ సాజిద్ అలీ, తహసీల్దార్ వీర్ సింగ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.