నిజామాబాద్, మార్చ్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాహిత్య సృజన ప్రయాణం లో కవులు తప్పకుండా సామాజికబాధ్యతతో, వ్యవహరించాలనీ, రాశి గల కవిత్వం కాకుండా వాసి గల కవిత్వం రాయాలనీ, కవులను ఉద్దేశించి సాహితీసేవలో గజారోహణ సత్కారం పొందిన విద్వద్కవి, శిరోమణి డా.అయాచితం నటేశ్వర శర్మ అన్నారు.
ఆదివారం డాక్టర్ గణపతి అశోక శర్మ స్వగృహంలో జరిగిన సాహిత్య అమృతోపన్యాస పరంపరలో భాగంగా మొదటి ఉపన్యాసాన్ని నటేశ్వర శర్మ అందించారు. ఈ సందర్భంగా అయాచితం ప్రసంగిస్తూ, ఇటీవలి కాలంలో కవుల రచనలు, పుస్తకాలు విరివిగా వస్తున్నా, కాలప్రవాహంలో అవి నిలబడవనీ, రాసిన ఒక్క రచనైనా ప్రామాణికంగా పదిమందిని నడిపించే విధమైనదిగా ఉండాలన్నారు. తీవ్ర అంతర్మథనం నుండే అమృతతుల్యమైన కవిత్వం పుడుతుందనీ, అప్పటికప్పుడే కవితలు రాసి వాటికి వెంటనే సన్మానాలు కావాలనీ, పుస్తకం రాయగానే పురస్కారం అందుకోవాలనీ తహతహలాడే కవుల ధోరణి సరికాదన్నారు.
వందల సంఖ్యలో పుస్తకాలు రాయడం కాదనీ, రాసినది ఒక్క పుస్తకమైనా చరిత్రలో నిలిచిపోయేలా రాయాలనీ దానికి ప్రాచీన సాహిత్యంలో నుండి దండి, భవభూతి మొదలగు మహాకవులను ఉదహరించారు. ఆద్యంతం మంచి ఉదాహరణలతో, సాహితీ ఉదంతాలతో, చక్కని దృష్టాంతాలతో, చమత్కారాలతో డా.నటేశ్వర శర్మ సాహితీప్రసంగం కవులను సాహిత్యాభిమానులనూ అలరించింది, ఆలోచింపజేసింది.
తల్లావజల మహేశ్ బాబు అధ్యక్షత వహించిన సభలో కవులు వి.పి.చందన్ రావు, డా.త్రివేణి, డా.కాసర్ల నరేశ్ రావు, గంట్యాల ప్రసాద్, కందకుర్తి ఆనంద్, అరుంధతి, తెలుగువెలుగు చంద్రశేఖర్, మల్లవరపు చిన్నయ్య, లక్ష్మణ్, చింతల శ్రీనివాస్ గుప్త, గణపతి శ్రీనివాస్, రాంప్రసాద్, అశోకశర్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సభలో డా.గణపతి అశోకశర్మ రచించిన ‘‘శారదాంబ శతకం’’ పుస్తకం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అయాచితం నటేశ్వర శర్మను నిర్వాహకులు, కవులు ఘనంగా సన్మానించారు.