నిజామాబాద్, మార్చ్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కవిత్వమే సమాజానికి వసంత హేతువు అని ప్రముఖ కవి సభా సామ్రాట్ విపి చందన్ రావు అన్నారు. శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలు మరియు 26వ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ‘‘ వసంతాన్ని పిలుద్దాం రా’’ శీర్షికన కవి సమ్మేళనం ఘనంగా జరిగింది.
తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కవి, సభా సామ్రాట్ విపి చందన్ రావు మాట్లాడుతూ ఉగాది ఆగమనంతో చెట్లకు వచ్చిన పచ్చదనం మనిషి జీవితాల్లో ఆనందమై సంతృప్తి రావాలని ఆకాంక్షించారు. కవిత్వం సమాజానికి వెలుగు రేఖగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా చేసిన ప్రముఖ కవి పంచరెడ్డి లక్ష్మణ మాట్లాడుతూ కవిత్వము, వసంతం మనిషి జీవితంలో ఉచ్వాస నిశ్వాసలుగా ఉన్నాయని ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు మాట్లాడుతూ మహిళలకు కవిత్వం సాహిత్యం ఆధునిక ఆయుధాలుగా పరిణమించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ కవిత్వం వ్యక్తిత్వం ఒకే విధంగా ఉన్న కలం యోధులు సమాజానికి చైతన్య దీపికలవుతారు అన్నారు.
కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు నరాల సుధాకర్, గుత్ప ప్రసాద్, కాసర్ల నరేష్, గంట్యాల ప్రసాద్, పద్మావతి, శంకర్ సింగ్, రమాశకుంతల, రమణాచారి, శ్రీరామ లక్ష్మణ్, గోపాల్, నాగరాజు, ఎలగందుల లింబాద్రి, దారం గంగాధర్, తిరుమల శ్రీనివాస్ ఆర్య, శంకర్, సాయిబాబు తదితరులు కవితా గానం చేశారు. ఈ సందర్భంగా కవులకు ఉగాది పురస్కారాలతో సత్కరించారు.