కామారెడ్డి, మార్చ్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినట్లు కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం నిరుపేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ హాజరై మాట్లాడారు.
నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నిరుపేదలకు జీవితంలో ఒక తృప్తి లభించిందని చెప్పారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, ఆత్మధైర్యంతో జీవించాలని సూచించారు. జీవో ఎం.ఎస్. నెంబర్ 58 (అసైన్మెంట్-1) కింద 233 మంది కామారెడ్డి పట్టణంలోని లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.
2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న వారిని ఆదుకోవాలని ప్రభుత్వం ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ జీవోను అమలుపరిచిందని పేర్కొన్నారు. ఎక్కువమంది నిరుపేదలు దరఖాస్తు చేసుకోలేదని, తాను ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో 2020 వరకు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉన్న నిరుపేదలు ఏప్రిల్ 30లోగా ఆన్లైన్ ద్వారా ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని పట్టణంలోని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
240 మంది దరఖాస్తులు చేసుకోగా 233 మంది ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇద్దరు ప్రైవేట్ స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవించడం వల్ల వారికి వర్తించలేదని చెప్పారు. ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. జీవో నెంబర్ 59 ప్రకారం వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మార్కెట్ ధర ప్రకారం స్థలాన్ని కొనుగోలు చేసుకునే వెసులు బాటు ప్రభుత్వం కల్పించిందని చెప్పారు.
మూడు విడతల్లో డబ్బులు చెల్లించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు విజయభాస్కర్ గౌడ్, అంజల్ రెడ్డి, రాజు, ప్రసన్న కుమార్, అధికారులు పాల్గొన్నారు.