‘పోడు’ పాస్‌ బుక్కులను క్షుణ్ణంగా పరిశీలించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూములకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీలో ఆమోదం పొందిన క్లెయిమ్‌ల ప్రకారంగా రూపొందించిన పట్టా పాస్‌ పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే అర్హులైన వారికి ఆర్‌ ఓ ఎఫ్‌ ఆర్‌ పట్టాలను అందించేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని అన్నారు.

కలెక్టర్‌ అధ్యక్షతన శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. పోడు భూములకు సంబంధించి వచ్చిన క్లెయిమ్‌ లు, అందులో ఆమోదం పొందిన క్లెయిమ్‌ లు ఎన్ని, క్షేత్ర స్థాయిలో ఇంకనూ ఏమైనా సమస్యలు అపరిష్కృతంగా మిగిలి ఉన్నాయా? తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. డివిజనల్‌, జిల్లా స్థాయి కమిటీలలో ఆమోదం పొందిన క్లెయిమ్‌లకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ముద్రించి, ఇప్పటికే జిల్లా అధికారులతో పరిశీలన జరిపించామని కలెక్టర్‌ తెలిపారు.

గ్రామ పంచాయతీల వారీగా మరోమారు పట్టా పుస్తకాలను క్షుణ్ణంగా వెరిఫికేషన్‌ చేయించాలని సూచించారు. వీటిలో ఏమైనా పొరపాట్లు, డూప్లికేషన్‌ వంటి వాటిని గుర్తిస్తే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. పరిశీలన ప్రక్రియను సత్వరమే చేపట్టి శనివారం లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. క్లెయిమ్‌ ల పరిశీలన వివరాలను పక్కాగా ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కంప్యూటరీకరించాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పట్టా పాస్‌ బుక్కుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగూరావు, ఆర్డీఓలు రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, అటవీ శాఖ అధికారులు, జిల్లా కమిటీ సభ్యులుగా ఉన్న భీంగల్‌, మోపాల్‌, సిరికొండ మండలాల జెడ్పిటీసీలు చౌట్పల్లి రవి, కమలా బానోత్‌, మాలావత్‌ మాన్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »