అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి సీజన్‌ అయినందున అగ్ని ప్రమాద ఘటనలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఇవి మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్‌ సమీక్ష నిర్వహించారు.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంతో పాటు కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ వార్షిక పరీక్షల నిర్వహణ, పోడు భూములకు పట్టాల పంపిణీ, జీ.ఓ నెం.లు 58 , 59 , 76, 118 అమలు, తెలంగాణకు హరితహారం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలను చేర్చడం తదితర అంశాల ప్రగతిని సమీక్షిస్తూ కీలక సూచనలు చేశారు. ఇటీవల హైదరాబాద్‌ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనలను సిఎస్‌ ఉటంకిస్తూ, ఈ తరహా ప్రమాదాలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.

ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలు, భవనాలు, వివిధ సంస్థలను గుర్తిస్తూ అగ్ని ప్రమాద నివారణకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించాలన్నారు. కాగా, ఆరోగ్య మహిళా, కంటి వెలుగు కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తోందని, వీటి ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలందేలా చొరవ చూపాలన్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని, వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్లోడ్‌ చేయాలన్నారు. ఈ ప్రక్రియలకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పూర్తి చేయాలని అన్నారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, మొక్కల సంరక్షణ, క్రమం తప్పకుండా నీటిని అందించడంపై దృష్టి సారించాలన్నారు. పాడైపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయించాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు అందుబాటులోకి వచ్చిన జిల్లాలలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు ఐ.డీ.ఓ.సీ ల్లోనే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఏప్రిల్‌ మాసం నుండి అద్దె నిలిపివేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ తో పాటు టెన్త్‌, డిగ్రీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, నిశిత పర్యవేక్షణ జరపాలని సి.ఎస్‌ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో అదనపు కలెక్టర్‌ లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్‌ మీనా, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »