వేల్పూర్, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే సీఎం కేసిఆర్ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం బాల్కొండ నియోజకవర్గంలోని ప్యాకేజీ 21 ద్వారా సాగునీరు అందించే పనుల పురోగతిని మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటలకు మొదలై సుమారు నాలుగు గంటల పాటు మండుటెండలో పొలాల నడుమ కాలినడకన తిరుగుతూ ప్యాకేజ్ 21 ఏ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
వేల్పూర్, భీంగల్ మండలాలకు చెందిన.. పచ్చల నడ్కుడ, వాడి కొత్తపల్లి, చెంగల్, బిబి తండా, ఎం.జి తండా గ్రామాల్లోని వాటర్ డిస్ట్రిబ్యూటరీ బాక్స్‌లు, (ఔట్లెట్ మేనేజ్మెంట్ సిస్టం) లను పరిశీలించారు. ఒక్కో ద్వారా 50పైగా ఎకరాలకు, ఒక్కో డిస్ట్రిబ్యూటరి ఛాంబర్ ద్వారా 12-15 ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేశామని మంత్రి వేముల తెలిపారు. ఇప్పటికే పచ్చల నడ్కుడ, వాడి కొత్తపల్లి, చెంగల్, బిబి తండా,ఎం.జి తండా గ్రామాల్లో 160 ఓఎంఎస్ బాక్సుల నుండి 448 డిస్ట్రిబ్యూటరి చాంబర్స్ ద్వారా సుమారు 4,500 ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు.
ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ మిషన్ ద్వారా ఇవి పని చేస్తాయన్నారు. చింతలూర్ వద్ద పెద్ద వాగుపై,బడా భీంగల్ కప్పల వాగుపై ట్యాపింగ్ పాయింట్స్ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి 15 రోజుల్లో వాటిని పూర్తి చేసి పంట పొలాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ అధికారులను అదేశించారు. ఈ ట్యాపింగ్ పాయింట్ నిర్మాణాలు పూర్తి అయితే యాసంగి లో కూడా ఈ రెండు వాగులలో నీళ్లు వదిలి చెక్ డ్యామ్ లు నింపే అవకాశం ఏర్పడుతుందని, దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి వాగు పరివాహక పంట పొలాలకు కిలోమీటర్ల మేర బోర్ల రీజనరేషన్ ద్వారా సాగునీరు అందుతుందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ సహకారంతో ప్యాకేజీ 21 ద్వారా ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే సుమారు 1650 కోట్ల వ్యయంతో 71వేల ఎకరాలకు కాళేశ్వరం జలాలు అందనున్నాయని చెప్పారు. సాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూటరి పైపు లైన్ వేసేందుకు రైతులు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ప్రశాంత్ రెడ్డి కట్టించిన చెక్ డ్యాం ద్వారా ప్రయోజనం పొందుతున్న – రైతు కొత్తూరు అంజయ్య
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 21ఏ పనుల గురించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పచ్చలనడ్కుడా గ్రామాల్లోని పొలాల్లో తిరుగుతూ రైతులకు వివరిస్తుండగా…రైతు కొత్తూరు అంజయ్య తన మనోగతాన్ని మంత్రితో,అక్కడున్న వారితో పంచుకున్నారు. గతంలో నీటి గోస ఉండే 9 బోర్లు వేసి అప్పుల పాలైన కానీ సుక్క నీళ్లు రాలేదు. కానీ ఇప్పుడు మూడు బోర్లలో నీళ్లు వచ్చినయ్. ఒక్కటే బోర్ ద్వారా 5ఎకరాల పొలానికి నీళ్లు పారించుకుంటున్న.
వానాకాలంలో అయితే బోర్ల నుంచి నీళ్లు పైకి ఎక్కి వచ్చినయ్. దీనికి ప్రశాంత్ రెడ్డి,కేసీఆర్ సారు కట్టించిన చెక్ డ్యాంలే కారణమంటూ ఎంతో సంబురంతో చెప్పాడు. ఇట్లా రైతుల మాటలు విన్నప్పుడు నిద్రహారాలు మాని రైతుల కోసం పడ్డ శ్రమ మర్చిపోవడమే కాకుండా ఆత్మసంతృప్తి కలుగుతుందని మంత్రి బదులిచ్చారు. రైతు సంతోషం కోసం కేసిఆర్ ఏం చేయడానికైనా వెనుకాడరని అన్నారు.
మండుటెండల్లో పొలాల్లో తిరుగుతున్న మంత్రికి తమ తోటలో పండిన దోసకాయలు అందించిన మహిళా రైతు
రైతులకు పైప్ లైన్ ద్వారా సాగునీరు అందించే ప్యాకేజ్ 21ఏ పనులను ఎండలో తిరుగుతూ పరిశీలిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అక్కడే తోటలో పని చేస్తున్న మహిళ రైతు తాను పండిరచిన దోసకాయ లను తినమంటూ ప్రేమతో మంత్రి దగ్గరికి వచ్చి ఇచ్చింది. బాగున్నారా అమ్మ.. పంట ఎట్లా ఉంది అని కుశల ప్రశ్నలు అడిగి, అభిమానంతో తనకు దోసకాయలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మహిళా రైతు అందించిన దోసకాయ తింటూ మంత్రి ముందుకు సాగారు.
మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ డి.ఈ భాను ప్రకాష్ ఇతర అధికారులు,పలువురు రైతులు ఉన్నారు.