నిజామాబాద్, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో రాహుల్ గాంధీ కుటుంబం పాత్ర ఎంతో ఉందని, దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని, నీరవ్ మోడీ, లలిత్ మోడీ భారతదేశ సంపదను దోచుకుని విదేశాలకు వెళితే దానిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై కేసు పెట్టడం సరైనది కాదని మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
శనివారం సుదర్శన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి నాయకులు రాహుల్ గాంధీని పప్పు అని, సోనియా గాంధీ ని దేశ వాసి కాదని మాట్లాడితే తప్పులేదు కానీ దేశాన్ని దోచుకున్న వారి గురించి మాట్లాడితే కేసులు పెడతారా అని సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. అదానికి 12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని నరేంద్ర మోడీ కట్టబెట్టాడని, పార్లమెంటులో మోడీకి అదానికి ఉన్న సంబంధం గురించి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వలేదని, పార్లమెంటులో రాహుల్ గాంధీపై అనర్హత వేయడం చాలా బాధాకరమని దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని సుదర్శన్ రెడ్డి అన్నారు.
ఎన్నికల సమయంలో జీరో అకౌంట్ ఉన్న ప్రతి ఖాతాలో 15 లక్షలు ఇస్తామని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గెలిచారని ఇలాంటి తప్పుడు హామీలపై ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని, రాహుల్ గాంధీ బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తే దానిని ఆపడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేశారని, భారత్ జోడొ పాదయాత్రతో రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజల మద్దతును స్పందనను చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు బిజెపి పూనుకుందని ఆయన అన్నారు.
దేశాన్ని దోచుకున్న వారిని దొంగలు అంటే కేసులు పెట్టడం సరైనది కాదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అంటే బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని, రాహుల్ గాంధి పై మోదీ ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని, దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారని, అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ పోరాటం చేయడం ప్రధాని మోదీకి కంటి మీద కునుకులేకుండా చేసిందని, ఆదానీ వ్యవహారాన్ని పార్లమెంటులో ఎండగడుతున్నందుకే బీజేపీ రాహుల్ గాంధీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అదానీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. రాహుల్ గాంధీని బీజేపీ టార్గెట్ చేసిందని, రాహుల్ గాంధీపై లోక్‌సభ సెక్రెటరీ అనర్హత వేటు వేయడం దుర్మార్గం అని, కోర్టు కూడా 30 రోజులు అప్పీల్‌కు టైం ఇచ్చింది.. అయినా హడావుడిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమే అని, ఈ కుట్రను న్యాయపోరాటం ద్వారా కాంగ్రెస్ ఛేదిస్తుందని సుదర్శన్ రెడ్డి అన్నారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హంధన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరికొండ గంగారెడ్డి, మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.