నిజామాబాద్, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందడంతో పాటు, దాని పరిధిలోని ప్రజల ఆర్ధిక, సామాజిక స్థితిగతులు మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అవార్డుల పంట పండుతోంది రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వ దార్శనికత, సమర్ధవంతమైన నిర్ణయాలను క్షేత్ర స్థాయి వరకు పకడ్బందీగా అమలు చేస్తుండడం వల్ల తెలంగాణలోని గ్రామ పంచాయతీలు స్వపరిపాలనలో ముందంజలో ఉన్నాయని తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం సాయంత్రం జిల్లా స్థాయి జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలితా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఎంపిక చేసిన తొమ్మిది అంశాలలో ఉత్తమ జీ.పీలుగా ఎంపికైన గ్రామపంచాయతీల పాలక వర్గాలకు మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.
ప్రభుత్వ పాలన ప్రభుత్వ సుపరిపాలనతో తెలంగాణకు జాతీయ స్థాయిలో వరుస అవార్డులు వరిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. 2021-22 సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద కేంద్రం దేశ వ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా, అందులో తెలంగాణలోని 19 గ్రామాలు ఉత్తమ జీపీలుగా ఎంపికయ్యాయని వివరించారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కేటగిరీలోనూ తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని, ఉత్తమ జిల్లాల కేటగిరిలో జగిత్యాల మొదటి స్థానంలో, నిజామాబాద్ జిల్లా మూడో స్థానాన్ని దక్కించుకొని అవార్డులను కైవసం చేసుకున్నాయన్నారు.
2022లో సుజలాం కేటగిరి-1లో తెలంగాణకు మూడో ర్యాంకు వచ్చిందని, సుజలాం-2 కేటగిరిలో కూడా మరో మారు తెలంగాణ రాష్ట్రం ద్వితీయ ర్యాంకును దక్కించుకోవడం విశేషం అన్నారు. ఇదే కోవలో ప్లాస్టిక్ మేనేజ్మెంట్లో తెలంగాణ మొదటి ర్యాంకును దక్కించుకుందని, నీటి యాజమాన్యం కేటగిరిలోను సౌత్ జోన్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని తెలిపారు. ఇలా వరుస అవార్డులు రావడం ఏదో ఆషామాషీగా జరగడం లేదని, ప్రభుత్వం ముందుచూపుతో చేపడుతున్న నిర్దిష్ట కార్యక్రమాలతో గ్రామాలను సుపరిపాలన దిశగా ముందు వరసలో నిలుపుతుండడం వల్లే అవార్డుల పంట పండుతోందని స్పష్టం చేశారు.
ఇదివరకు కేంద్రం గ్రామ పంచాయతీలకు అందించే అత్తెసరు నిధులు జీ.పీల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకే సరిపోయేవని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2019 నుండి తెలంగాణలో పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, కేంద్రం అందిస్తున్న నిధులకు సరిసమానంగా స్టేట్ ఫైనాన్స్ ద్వారా జిపి లకు నిధులను సమకూరుస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినెల 256 కోట్ల రూపాయల చొప్పున గడిచిన మూడున్నర ఏళ్లలో సుమారు 11 వేల కోట్ల రూపాయలను జిపిలకు అదనంగా అందించిందన్నారు. దీనివల్ల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు వృద్ధి చెందాయని, ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగయ్యాయని అన్నారు.
అదనపు నిధులకు తోడు మిషన్ భగీరథ, హరితహారం, పచ్చదనం-పరిశుభ్రత, ఆసరా పథకం కింద పెద్ద మొత్తంలో పెన్షన్లను పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలు సైతం అవార్డులు రావడానికి దోహదపడుతున్నాయని మంత్రి తెలిపారు. ఇకముందు కూడా ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సమిష్టిగా పని చేస్తూ మరిన్ని అవార్డులు వరించేలా కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్ లో ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల స్వరూపం ఎంతగానో మార్పు సంతరించుకుందని అన్నారు. ఐదు విడతలుగా అమలైన పల్లె ప్రగతి కార్యక్రమాల ఫలితంగా గ్రామపంచాయతీలు పచ్చదనం – పరిశుభ్రతతో అలరారుతున్నాయని, ప్రతి జీపీలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ట్రాక్టర్ వంటి వనరులు, సదుపాయాలు సమకూరాయని గుర్తు చేశారు.
హరితహారం కింద నాటే మొక్కలను ఇదివరకు ఇతర ప్రాంతాల నుండి కొనుగోలు చేయాల్సి వచ్చేదని, ప్రస్తుతం గ్రామపంచాయతీలే సొంతంగా నర్సరీలను నిర్వహిస్తూ, తమకు అవసరమైన మొక్కలను స్థానికంగానే సమకూర్చుకుంటున్నాయని తెలిపారు. సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పల్లె ప్రకృతి వనాలను పోటీపడి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఫలితంగా గ్రామాల్లో ఆరోగ్యకర వాతావరణం నెలకొని వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టాయని కలెక్టర్ అన్నారు.
తమ పల్లెలను మరింతగా బాగు చేసుకోవాలనే సంకల్పం తో స్థానిక సంస్థల ప్రతినిధులు చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలితా, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, డీపీఓ జయసుధ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎంపీడీఓలు, పంచాయతీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.