నిజామాబాద్, మార్చ్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోషక లోపాలను నివారిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే సిరి ధాన్యాల వినియోగం ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు పోషణ్ పక్వాడ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా అధ్యక్షతన వివిధ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
పాఠశాలల్లో కిశోర బాలికలకు అనీమియా (హెచ్.బీ టెస్ట్) పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. లీకేజీలు ఉన్నట్లయితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని, నీటి వసతి కల్పనకు చొరవ చూపాలని మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పోషక లోపాలను నియంత్రించాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న పోషణ పక్వాడ కార్యక్రమంలో సర్పంచులు, సచివాలయ కార్యదర్శులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని సూచించారు.
సిరిధాన్యాల వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, సంపూర్ణ ఆరోగ్యానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి విరివిగా సిరి ధాన్యాలు వినియోగించేందుకు వీలుగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అన్ని పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు సిరిధాన్యాల అంశంపై వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించాలని సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు.
పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ అధికారిణి కే.సుధారాణి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, వ్యవసాయ అధికారి వాజీద్ హుస్సేన్, సిడిపివోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.