కామారెడ్డి, మార్చ్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రస్తుత సంవత్సరంలో చేపట్టిన 9 నూతన వైద్య కళాశాల పనులపై జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు.
రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న 9 వైద్య కళాశాల పనుల పురోగతిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సంబంధించిన ఇంజనీరింగ్ ఏజెన్సీలో ప్రతినిధులు ప్రజా ప్రతినిధులతో రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, టిఎస్‌ఎంఐడిసి డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.
ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే దిశగా సీఎం కేసీఆర్ లక్ష్యం నిర్దేశించారని, దాని సాధనలో భాగంగా గత సంవత్సరం ఒకే సమయంలో రికార్డు స్థాయిలో 8 నూతన వైద్య కళాశాలలో రాష్ట్రంలో ప్రారంభించుకున్నామని, ప్రస్తుత సంవత్సరం 9 వైద్య కళాశాల ప్రారంభించే లక్ష్యంతో వేగంగా పనులు సాగుతున్నాయని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలో 5 వైద్య కళాశాలలు 1180 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయని, 2014 తరువాత సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో 12 నూతన వైద్య కళాశాల ప్రారంభించి అదనంగా 1365 ఎంబిబిఎస్ సీట్లు (మొత్తం 2545 సీట్లు) ఏర్పాటు చేసుకున్నామని, ప్రస్తుత సంవత్సరంలో ప్రారంభించే 9 నూతన వైద్య కళాశాల సీట్లు కలిపితే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3600 చేరుకుంటుందని మంత్రి తెలిపారు. ఎంబిబిఎస్ సీట్ల వృద్ధిలో జాతీయ సగటు 71 శాతం ఉంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఆ వృద్ధి రేటు 240 శాతం ఉందని, దేశంలో ప్రతి లక్ష జనాభాకు అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య లో తెలంగాణ అగ్రగామిగా ఉందని మంత్రి తెలిపారు.

ప్రస్తుత సంవత్సరం కరీంనగర్, కామారెడ్డి, జనగామ, వికారాబాద్ ,ఖమ్మం ,జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ , నిర్మల్ జిల్లాలో నూతన వైద్య కళాశాల పనుల జరుగుతున్నాయని, వీటిపై జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి రోజు పనులు పురోగతి తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న చిన్న సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితులలో పనులలో ఆటంకం కలుగవద్దని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో నిర్మించే 9 వైద్య కళాశాల పనులను జాతీయ వైద్య కమిషన్ పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తుందని, రాష్ట్రంలో ఇప్పటికే 6 వైద్య కళాశాల పనులను క్షేత్రస్థాయిలో ఎన్‌ఎంసి పరిశీలించిందని, త్వరితగతిన పెండిరగ్ ఆసిఫాబాద్ సిరిసిల్ల నిర్మల్ జిల్లాలలో ఎన్‌ఎంసి పర్యటన ఉంటుందని, ఆయా జిల్లాల కలెక్టర్లు వైద్యశాఖ అధికారులు సమావేశం నిర్వహించుకుని ఎన్‌ఎంసి తనిఖీలకు సిద్ధంగా ఉండాలని మంత్రి తెలిపారు.
వైద్య కళాశాలలో అవసరమైన సామాగ్రి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, టీచింగ్ స్టాఫ్ అసోసియేట్ ప్రొఫెసర్ల , మిగిలిన స్టాఫ్ నియామక ప్రక్రియ నెలన్నర కాలంలో పూర్తి చేస్తామని అన్నారు. వైద్య కళాశాలల నిర్మాణానికి ఏప్రిల్ మాసం చాలా కీలకమని, ప్రతిరోజు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ మంచి పురోగతి నమోదు కావాలని ఆయన సూచించారు. జూలై నుంచి మొదటి విడత అడ్మిషన్స్ ప్రారంభం అయ్యే నేపథ్యంలో, వైద్య కళాశాలలను సన్నద్ధం చేసి ఎన్‌ఎంసి నుంచి అనుమతి సాధించాలని మంత్రి పేర్కొన్నారు.
వైద్య కళాశాలలో చదివే పిల్లల కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు చేయాలని, జిల్లాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ భవనాలను పరిశీలించి , అక్కడ అవసరమైన మరమ్మత్తులు చేయాలని మంత్రి సూచించారు. వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన బెడ్ల సంఖ్యను జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించాలని, ఆ పనులు త్వరితగతిన పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు.
మహిళల కోసం ప్రారంభించిన ఆరోగ్య మహిళా కేంద్రాలను మరింత విస్తృతంగా వినియోగించాలని, కరీంనగర్ జిల్లాలో అధిక సంఖ్యలో మహిళల భాగస్వామ్యం చేస్తూ మంచి ఫలితాలు సాధించారని, అదేవిధంగా ఇతర జిల్లాల్లో సైతం అమలు చేయాలని మంత్రి తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం పై కలెక్టర్లు ప్రజాప్రతినిధులు నిరంతర పర్యవేక్షణ చేయాలని, ప్రతి జిల్లా కేంద్రంలో టీఫా స్కానింగ్ యంత్రం అందుబాటులో ఉంచామని, దీని పై విస్తృత ప్రచారం కల్పించి అవసరమైన గర్భిణీ స్త్రీలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితులలో పరీక్ష నిర్వహణకు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
ఆకస్మిక గుండెపోటు నివారణకు చేపట్టిన సిపిఆర్ శిక్షణ వివిద వర్గాల ప్రజలకు పకడ్బందీగా అందించాలని అన్నారు. దేశంలోనే అవయవ దానంలో తెలంగాణ ప్రధమంగా నిలిచిందని, ఇదే స్ఫూర్తి భవిష్యత్తులో కొనసాగిస్తూ అవయవదానం చేయడానికి ముందుకు వచ్చే విధంగా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని మంత్రి సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. జిల్లాలో ఆరోగ్య మహిళా కార్యక్రమం పై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎర్రపాడు, డోంగ్లి ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు 8 రకాల పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 2,48541 మంది పరీక్షలు చేశారని , అవసరమైన 39,171 మందికి కంటి అద్దాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మణ్ సింగ్,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.