డిచ్‌పల్లి, మార్చ్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రాంతం ప్రాచీన చరిత్రకు నిలయమని నిజామాబాద్ చరిత్ర కూడా ఎంతో ప్రాచీనమైనదని, తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ డి రవీందర్ గుప్తా అన్నారు. విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్ న్యాయ కళాశాల సెమినార్ హాల్‌లో మంగళవారం ఆరంభమైన తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో చరిత్ర కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించడం పట్ల వైస్ ఛాన్స్‌లర్ హర్షం వ్యక్తం చేశారు. చరిత్ర కాంగ్రెస్ సమావేశాల ద్వారా అనేక చారిత్రక అంశాలు వెలుగులోకి వస్తాయని వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రసిద్ధ చరిత్రకారులు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య కె ఎస్ ఎస్ శేషన్ సదస్సులో విశిష్ట అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు.
నిజాం సంస్థానంలో ఆనాటి రైల్వే వ్యవస్థ అనే అంశంపైన ఆయన చేసిన ప్రసంగంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడిరచారు. నిజాంనాటి రైల్వే వ్యవస్థ ద్వారా ఆనాటి సంస్థానంలో ఏర్పడిన సామాజిక, ఆర్థిక పరివర్తనల గురించి వివరించారు. ఆరంభ కార్యక్రమంలో హర్యానాలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం విశ్రాంత ఆచార్యులు రవీంద్ర కుమార్ శర్మ, తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ విద్యావర్ధిని, ప్రముఖ చరిత్రకారులు ఆచార్య కే అర్జునరావు, డాక్టర్ జై కిసాన్, డాక్టర్ ఆర్ సూర్య కుమార్ పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం విశ్రాంత ఆచార్యులు వెంకటరాజం ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ సదస్సు నిర్వహణలో సంపూర్ణ సహకారాన్ని అందించిన వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య డి రవీందర్ గుప్తాకు, ఆచార్య వెంకటరాజం కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ కార్యదర్శి వీరేందర్ సదస్సు లక్ష్యాలను వివరించారు. సదస్సు స్థానిక సమన్వయకర్త ఆచార్య బాల శ్రీనివాస మూర్తి వక్తలను పరిచయం చేశారు.
తొలత తెలంగాణ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి సాయిలు కార్యక్రమానికి స్వాగతం తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు, డాక్టర్ కే రవీందర్ రెడ్డి, డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ కవి, ఆచార్య వి త్రివేణి, పలువురు చరిత్ర ఆచార్యులు, పరిశోధకులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే సదస్సు బుధవారం సాయంత్రం ముగుస్తుందన్నారు.