ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మారిన ప్రస్తుత సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా జడ్జి సునీత కుంచాల హితవు పలికారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు శనివారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు.

జిల్లా కోర్టు నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా పులాంగ్‌ చౌరస్తా వరకు కొనసాగి, తిరిగి అదే మార్గంలో కోర్టు కాంప్లెక్స్‌ వద్దకు చేరుకుంది. జిల్లా సెషన్స్‌ జడ్జితో పాటు అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, యువకులు సైకిల్‌ ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సెషన్స్‌ జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ, నేటి రోజుల్లో అనేక మంది వ్యాయామానికి దూరంగా ఉంటున్నారని అన్నారు. సరైన పోషకాహారాన్ని తీసుకోకుండా జంక్‌ ఫుడ్‌ వైపు మొగ్గు చూపుతున్నారని, నడకను తగ్గించేశారని తెలిపారు. ఈ పరిణామాలు ఆరోగ్యాలపై దుష్ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మన నిత్య జీవితంలో తారసపడే వారిలో అనేకమంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతం అవుతున్నారని అన్నారు. ఇదివరకు ఎక్కడికి వెళ్లాలన్న సైకిల్‌ విరివిగా వాడేవారని, ఆరోగ్య సాధనకు ఇది ఎంతగానో దోహదపడేదని జిల్లా జడ్జి గుర్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య పరిరక్షణ ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సైకిల్‌ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు.

అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పని ఒత్తిడికి లోను కావాల్సి వస్తోందన్నారు. దీనికి తోడు మారిన ఆహారపు అలవాట్లు అనారోగ్యాల బారిన పడేలా చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా అనేకమంది గుండెపోటుకు గురై అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఆందోళనకరంగా పరిణమించాయని అన్నారు. ఆరోగ్యకర జీవనాల కోసం ప్రతి ఒక్కరు క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

ఆరోగ్యాల పట్ల తగిన జాగ్రత్తలు పాటిస్తూ, యోగా, నడక, వ్యాయామాలకు తప్పనిసరిగా సమయం కేటాయించాలని హితవు పలికారు. ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థతో కలిసి జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

ర్యాలీలో అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు, సీనియర్‌ సివిల్‌ జడ్జిలు పద్మావతి, శ్రీకాంత్‌ బాబు, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు భవ్య, సౌందర్య, గిరిజ, రాష్ట్ర బార్‌ అసోసియేషన్‌ సభ్యుడు రాజేందర్‌ రెడ్డి, సైక్లింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధి విజయ్‌ కుమార్‌, రోటరీ క్లబ్‌ ప్రతినిధి సతీష్‌ షా, సీనియర్‌ న్యాయవాదులు రాజ్‌కుమార్‌ సుబేదార్‌, ఆశ నారాయణ, భాస్కర్‌, కోర్ట్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »