నిజామాబాద్, ఏప్రిల్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గొర్రెల పంపిణీ పథకం అమలులో కలెక్టర్‌లు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న సందర్భంగా మంత్రి గొర్రెల పంపిణీ పథకం పై పలు సూచనలు చేశారు. ఇప్పటికే యాభై శాతం మందికి గొర్రెల పంపిణీ పూర్తయిందని, మిగతా లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి తెలిపారు.
2017 లో ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ.నెం.52 నిబంధనలనే అనుసరిస్తూ ఈ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. ఇంకనూ ప్రభుత్వం ఏవైనా కొత్త నిబంధనలను అమలు చేయదలిస్తే, వాటికి సంబంధించిన మార్గదర్శకాలు అందిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి మేలు రకానికి చెందిన గొర్రెలు కొనుగోలు చేయడానికి సమర్థులైన జిల్లా అధికారుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
గొర్రెల రవాణా, వాటికి బీమా, దాణా, జియో ట్యాగింగ్ తదితర అంశాలను పశుసంవర్ధక శాఖ అధికారులు పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఈ పథకాన్ని ఇదివరకు అమలు చేసిన అనుభవం ఉన్నందున ప్రస్తుతం మరింత మెరుగైన రీతిలో గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డబుల్ బెడ్ రూమ్ పథకంతో పాటు కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, జీ.ఓ నెం.లు 58 , 59 , 76, 118 అమలు, తదితర అంశాల ప్రగతిని సమీక్షిస్తూ కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఇవి మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు.
కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, నిజామాబాద్ జిల్లాలో వంద శాతం అద్దాల పంపిణీ జరిగిందని సీ.ఎస్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. కంటి వెలుగు శిబిరాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీ.ఎస్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.