నిజామాబాద్, ఏప్రిల్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను శనివారం సాయంత్రం జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. మెడికల్ కళాశాలలో అందుబాటులో ఉన్న వసతి, సదుపాయాలను పరిశీలించారు. కళాశాల నిర్వహణ తీరు గురించి ప్రిన్సిపాల్ ఇందిరను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కలెక్టర్ విద్యార్థులకు ధైర్య వచనాలు పలుకుతూ, వారిలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు.
ఎంతటి సమస్యలు వచ్చినా, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని, మానసిక ఒత్తిడిని జయించాలని సూచించారు. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడితే తల్లిదండ్రులకు, కుటుంబీకులకు తీరని శోకం మిగులుతుందని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి వైద్య విద్య స్థాయికి చేరుకున్న తరుణంలో బంగారు భవిష్యత్తు ఉంటుందని సూచించారు. మెడికల్ కళాశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా, పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం తరపున చర్యలు చేపడతామని భరోసా కల్పించారు.