నిజామాబాద్, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని రవి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు.
నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? స్ట్రాంగ్ రూం ల నుండి ఎన్ని గంటలకు ప్రశ్న పత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉందా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి అందుబాటులో ఉందా? లేదా? అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులకు సూచించారు.
ఎక్కడ కూడా కాపీయింగ్ కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కాపీయింగ్ కు పాల్పడితే మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేయాలని నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలు ముగిసేంత వరకు కూడా ఎంతో అప్రమత్తతతో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఎండీ.ఫజలుల్లాప్ా తదితరులు ఉన్నారు.