కామారెడ్డి, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. పోరాట స్ఫూర్తికి దొడ్డి కొమురయ్య ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఆయన పోరాటం ప్రజలందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గొల్ల, కుర్మల అభివృద్ధికీ పెద్ద పీట వేస్తున్నారనీ అన్నారు.
పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమురయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా బిసి అభివృద్ధి అధికారి శ్రీనివాస్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి సాయిలు, ఉద్యోగులు సాయి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజలింగం, జిల్లాబిసి నాయకులు శివరాం, రాజయ్య, గొల్ల, కురుమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.