నిజామాబాద్, ఏప్రిల్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చే వారి కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో పులిహోర వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా పులిహోర పంపిణీ చేశారు.
వేసవి ఎండలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో, ప్రజావాణి కార్యక్రమానికి ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల కోసం పులిహోర పంపిణీ కార్యక్రమం చేపట్టామని, ప్రతి సోమవారం దీనిని కొనసాగిస్తామని సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ అధ్యక్షుడు భూమన్న తెలిపారు. కాగా, మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో చల్లటి తాగునీటిని సమకూర్చారు. ఫోరం ప్రతినిధులను, మార్వాడీ యువమంచ్ బాధ్యులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, కోశాధికారి అరుణ్ బాబు, విజయ్ కుమార్, ఏ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.