నిజామాబాద్, ఏప్రిల్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్‌లు, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ఇటీవలే పూర్తయిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
2018, 2019 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల గురించి కలెక్టర్ ఆరా తీయగా, వాటిని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కేరళ, తమిళనాడు, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు తరలించడం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాకు వీ.వీ.ఫ్యాట్ లు, ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, కంట్రోల్ యూనిట్లు అన్నీ కూడా కొత్త వాటిని కేటాయించారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అనుకోని రీతిలో ప్రమాదాలు సంభవించిన సమయాల్లో తక్షణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన అగ్నిమాపక సామగ్రి, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్, అగ్నిమాపక శాఖకు చెందిన అధికారి నర్సింగ్ రావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.