కామరెడ్డి, ఏప్రిల్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెడ్డిలు అంతా ఐక్యమై మన సత్తా ఏమిటో ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రెడ్డి జాగృతి సంఘం వ్యవస్థాపకులు మాధవరెడ్డి అన్నారు. రెడ్డిలందరూ అన్ని రంగాల్లో అనగదొక్క బడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతి ఒక్క రెడ్డి ఐక్యం కావాలని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్స్‌లో రెడ్ల ఆత్మీయ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్డి జాగృతి సంఘం వ్యవస్థాపకులుబుట్టెం గారి మాధవరెడ్డి హాజరై మాట్లాడారు. రెడ్డిలో చాలామంది పేదవారు ఉన్నారని తెలిపారు. అలాంటి వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్ల సంక్షేమం కోసం గతంలోనే సీఎం కేసీఆర్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ ఇప్పటివరకు నెరవేర్చలేదని పేర్కొన్నారు. రెడ్డిలలో ఐక్యత లోపించడంతోనే ప్రభుత్వం రెడ్డిల పట్ల చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి విషయంలో రెడ్డిలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఇకనైనా ప్రతి రెడ్డి మేల్కోవాలని సూచించారు. ఇందుకు రెడ్డిలంతా ఐక్య మై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో రెడ్డిల తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి రెడ్డిల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. అలాగే 5వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో రానున్న రోజుల్లో రెడ్డిల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఈ నెల ఏప్రిల్ 11వ తేదీన చేపట్టిన సిద్దిపేట్ రెడ్డిల ఆత్మీయ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రతినిధులు రామ్ రెడ్డి, ఎడ్ల రాజరెడ్డి, రవీందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.