కామారెడ్డి, ఏప్రిల్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలను తప్పనిసరిగా డిగ్రీ వరకు చదివించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బాలికలను చదివించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. ఆస్తుల కన్నా ముఖ్యమైనది చదవని గుర్తించాలని చెప్పారు.
మహిళల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు సమాజానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల కారణంగా వెనకబడిన తరగతుల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ మాట్లాడారు. మహనీయుల త్యాగాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. మహనీయుల చరిత్ర పాఠశాలలోని విద్యార్థులకు బోధించే విధంగా చూడాలని కోరారు. సమాజంలో మార్పు కోసం జ్యోతిబాపూలే కృషి చేశారని కొనియాడారు.
ఈ సందర్భంగా బాన్సువాడ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు, కామారెడ్డి జ్యోతిబా పూలే జూనియర్ కళాశాల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా తెలంగాణ సాంస్కృతి సారధి కళాకారులు మహనీయుల త్యాగాలను వివరిస్తూ పాటలు పాడారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న జ్యోతి రావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్, టీఎన్జీవోఎస్, బహుజన సంఘాల ప్రతినిధులు, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీనివాస్, బీబీపేట ఎంపీపీ బాలమణి, దోమకొండ జడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్, బహుజన సంఘాల ప్రతినిధులు సిద్ధి రాములు, బలరాం, విజయ్ కుమార్, సంపత్, రాజయ్య, శ్రీకాంత్, రాజీవ్ కుమార్, నాగరాజు, నాగభూషణం పాల్గొన్నారు.