ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేడ్కర్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు అర్బన్‌ శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్తా అధ్యక్షత వహించగా, జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్పర్సన్‌ ఆకుల లలిత, మహిళా కమిషన్‌ సభ్యులు సూదం లక్ష్మి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా మాట్లాడుతూ, పూలే కృషిని కొనియాడారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను పారద్రోలేందుకు జ్యోతిబాపూలే చేసిన కృషి అనన్య సామాన్యమైనదని అన్నారు. అనేక అవరోధాలు, అవమానాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం వెరువకుండా పూలే నాటి సాంఘిక దురాచారాలను తుదముట్టించేందుకు ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. ముఖ్యంగా అణగారిన వర్గాలు, శూద్రులు సమానత్వం సాధించాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి వారికి విద్య అందేలా తీవ్రంగా కృషి చేశారని, మహిళల విద్య కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పాఠశాలను స్థాపింపజేశారని అన్నారు.

మహాత్మ జ్యోతిబాపూలే ఆలోచనలకు ప్రభావితమైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పూలేను తన గురువుగా ప్రకటించారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. గురుకులాలకు జ్యోతిబాపూలే పాఠశాలలుగా నామకరణం చేస్తూ నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ఒక్కో విద్యార్థి పై ఏటా రూ. 1,25,000 లను ప్రభుత్వం ఖర్చు చేస్తూ కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా బోధనను అందిస్తోందని ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా అన్నారు. బీసీ సంఘాల విజ్ఞప్తి మేరకు నగరంలో బీసీ స్టడీ సర్కిల్‌, బీసీ కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

జెడ్పి చైర్మన్‌ విఠల్‌ రావు మాట్లాడుతూ, పూలే వంటి మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే మన జీవితానికి కూడా సార్థకత చేకూరుతుందన్నారు. సత్యశోధక్‌ సమాజ్‌ ను స్థాపించి దురాచారాలను రూపుమాపారని గుర్తు చేశారు. పూలే ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో వివిధ వర్గాల వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు విరివిగా రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, సమాజంలోని చెడును అంతమొందించేందుకు, సామాజిక రుగ్మతలను, దురాచారాలను పారద్రోలేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో పయనిస్తూ, పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో అణగారిన వర్గాలకు తగిన గౌరవం దక్కాలంటే విద్యతోనే సాధ్యం అని గుర్తించిన పూలే, విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారన్నారు. ప్రత్యేకించి బాలికల విద్య కోసం పాఠశాలలు నెలకొల్పి ప్రత్యేక కృషి కొనసాగించారని అన్నారు.

కేవలం చెప్పడంతోనే సరిపెట్టుకోకుండా తన సతీమణి సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఆచరణలో చేసి చూపిన మహనీయుడు జ్యోతిబా అని ప్రశంసించారు. సత్యశోధక్‌ సమాజం స్థాపించి సామాజిక అసమానతలు, రుగ్మతలను పారద్రోలేందుకు కృషి చేశారని అన్నారు. అన్ని వర్గాలకు సమానత్వం ఉండాలన్నదే పూలే అభిమతం అని, ఆ దిశగా తుది వరకు తన కృషిని కొనసాగించారని కొనియాడారు. పూలే కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. నేటి సమాజంలోనూ ఇంకనూ అక్కడక్కడ నెలకొని ఉన్న వివక్షతను రూపుమాపేందుకు పూలే స్పూర్తితో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట సాంఘిక బహిష్కరణలు విధిస్తే, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పూలే జయంతి వేదిక ద్వారా స్పష్టం చేశారు. సాంఘిక బహిష్కరణలు వంటి రుగ్మతలకు వ్యతిరేకంగా వివిధ సంఘాలు కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌ మాట్లాడుతూ, జ్యోతిబా పూలే కుల, వర్గ, వర్ణ వివక్షతతో కూడిన నాటి సమాజంలో రుగ్మతలను దూరం చేసేందుకు చదువు ఒక్కటే సరైన మార్గం అని గుర్తించి ఆ దిశగా అకుంఠిత దీక్షతో కృషి చేశారని అన్నారు. బాలికల విద్య ఆవశ్యకతను నొక్కి చెబుతూ, సమాజంలోని మహిళా లోకానికి దిక్సూచిగా మారారని అన్నారు.

అంతకుముందు వినాయక్‌ నగర్‌ హనుమాన్‌ జంక్షన్‌ వద్ద గల మహాత్మా పూలే విగ్రహానికి జెడ్పి చైర్మన్‌, కలెక్టర్‌, బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, మెప్మా పీడీ రాములు, బీసీ సంఘాల బాధ్యులు బుస్స ఆంజనేయులు, నరాల సుధాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, యెండల ప్రదీప్‌, మాడవేడి వినోద్‌ కుమార్‌, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »