నిజామాబాద్, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితాలో తమ పేరును తొలగించారంటూ అర్హులైన ఏ ఒక్క ఓటరు నుండి కూడా ఫిర్యాదులు రాకుండా జాబితా పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. బుధవారం ఆయన ఎన్నికల జాబితా, బూత్ లెవెల్ అధికారుల నియామకం, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.
ఇది ఎన్నికల ఏడాది అయినందున ఓటరు జాబితాను పునః పరిశీలించుకుని ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరి చేసుకోవాలన్నారు. ముఖ్యంగా అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తప్పిపోకుండా చూడాలన్నారు. మృతి చెందిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించే విషయంలోనూ ఒకటికి రెండుసార్లు వివరాలను సరి చూసుకోవాలని హితవు పలికారు.
తొలగించిన ప్రతి ఓటరు పేరుకు సంబంధించి స్పష్టమైన కారణాలు, ఆధారాలను పొందుపర్చాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్షేత్రస్థాయి పరిశీలన జరుపకుండా, రికార్డులను ధృవీకరించుకోకుండా జాబితా నుండి ఓటర్ల పేర్లు తొలగించకూడదని ఆదేశించారు. తాము అర్హులైనప్పటికీ జాబితా నుండి తమ పేరు తొలగించారంటూ ఏ ఒక్కరు ఫిర్యాదు చేసినా, సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
ఓటర్ల జాబితా నుండి తొలగించిన పేర్లను పునః పరిశీలించాలి : కలెక్టర్
కాగా, వివిధ కారణాల వల్ల ఓటర్ల జాబితా నుండి తొలగించిన పేర్లను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆర్డీఓలు, తహసీల్దార్లు, నియోజకవర్గ ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులతో కలెక్టర్ సమావేశమై పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 39 వేల పైచిలుకు మంది పేర్లు వివిధ కారణాలతో ఓటరు జాబితా నుండి తొలగించడం జరిగిందన్నారు. వీటిని పునఃపరిశీలించుకోవాలని, అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా జాబితా నుండి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.
పోలింగ్ స్టేషన్ వారీగా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపాలని సూచించారు. ప్రభుత్వం నుండి వేతనం/గౌరవ వేతనం పొందుతున్న వారినే బూత్ లెవెల్ అధికారులుగా కొనసాగించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్‌డీఓ చందర్, జెడ్పి సీఈఓ గోవింద్, ఆర్డీఓలు రవి, రాజేశ్వర్, శ్రీనివాసులు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల తహసీల్దార్లు, సహాయ ఈ.ఆర్.ఓలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ తదితరులు పాల్గొన్నారు.