హైదరాబాద్, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి గణితం పబ్లిక్ పరీక్ష నందు 6, 9, 11, 14 ప్రశ్నలకు గ్రేస్ మార్కులు కలపాలని ప్రభుత్వాన్ని కోరుతూ గణిత ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు సంబంధించిన మోడల్ ప్రశ్నలు కాకుండా ప్రైవేట్ పబ్లిషర్స్ ప్రచురించిన పుస్తకాల నుండి ప్రశ్నలను కాపీ చేసి పదవ తరగతి గణితం పబ్లిక్ పరీక్షలో ఇచ్చినందున తెలివైన విద్యార్థులు కూడా మెరిట్ మార్కులు సాధించడం కష్టతరంగా ఉంది. కావున ఆ ప్రశ్నలకు విద్యార్థులు నష్టపోకుండా గ్రేస్ మార్కులు కలిపేలాగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
కార్యక్రమంలో తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పసుపులేటి నరేంద్రస్వామి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు తాడ్వాయి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.శ్యామసుందరా చార్యులు, రాష్ట్ర కోశాధికారి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలాగే జిల్లాల ప్రతినిధులు సంఫీుభావం తెలిపారు.