కామారెడ్డి, ఏప్రిల్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరో సారి పరిశీలన చేయాలనీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్‌లతో ఓటర్ జాబితా లో పి.ఎస్.ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ, బూత్ లెవెల్ అధికారుల నియామకం అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడారు. ఫోటో సిమిలర్ ఎంట్రీ మొదటి దఫా క్రింద క్షేత్రస్థాయిలో తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన, మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు జాబితా నుంచి తొలగించామని, తొలగించిన ఓట్లకు సంబంధించిపూర్తి సమాచారం తమ వద్ద అందుబాటులో ఉండాలని, తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అవసరమైన డాక్యుమెంట్లు ఉన్నాయో లేవో ధ్రువీకరించాలని ఆయన పేర్కొన్నారు.
ఓటరు జాబితా రూపకల్పనలో బూత్ స్థాయి అధికారులు కీలకపాత్ర పోషిస్తారని, ప్రైవేట్ వ్యక్తులను బూత్ స్థాయి అధికారులుగా నియమించవద్దని,ఎక్కడైనా అలా ఉంటే ఏడు రోజులలో తొలగించి ప్రభుత్వ సిబ్బందినీ నియమించాలని ఆయన సూచించారు. వీడియో సమావేశం అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ఓటర్ల జాబితా పై పలు సూచనలు చేశారు.జిల్లాలో ఉన్న ఫోటో సిమిలర్ ఎంట్రీలను ఆర్డీవోలు, తహసిల్దార్‌లు ప్రత్యేకంగా పరిశీలించాలని, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలని తెలిపారు. ఓటరు జాబితా నుంచి తొలగించిన పేర్ల వివరాలు మరోసారి పరిశీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేర డాక్యుమెంట్లు సంతకాలు ఉన్నాయో లేవో తనిఖీ చేయాలని కలెక్టర్ రెవిన్యూ డివిజన్ అధికారులను, తహసిల్దారులకు సూచించారు.
వీడియో సమావేశంలో ఎల్లారెడ్డి, కామారెడ్డి ఆర్డిఓలు శీను, శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, అధికారులు ఇందిరా ప్రియదర్శిని, నరేందర్ పాల్గొన్నారు.