కామారెడ్డి, ఏప్రిల్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం హైదరాబాదులో జరిగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు బస్సుల ద్వారా 300 మంది ప్రజలను తరలించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో విగ్రహావిష్కరణ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు.
మండల కేంద్రాల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలకు బస్సులలో ప్రజలను హైదరాబాద్ కు తరలించాలని తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తప్పనిసరిగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు చేరుకునే విధంగా అధికారులు చూడాలని చెప్పారు. ప్రజలకు టిఫిన్, మధ్యాహ్న భోజనం, డిన్నర్, తాగునీరు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ప్రతి బస్సులో ఒక పోలీస్ అధికారి, నోడల్ అధికారి ఉండే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు.
బస్సులు తిరిగి మండల కేంద్రానికి చేరేవరకు జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. టెలికాన్ఫరెన్స్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ డిఆర్డిఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, డిఎల్‌పిఓ సాయిబాబా, ఆర్డీవోలు శ్రీనివాసరెడ్డి, శీను, రాజా గౌడ్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.