కామారెడ్డి, ఏప్రిల్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో డాటా ఎంట్రీ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గురువారం సహకార సంఘాల, ఐకెపి అధికారులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డాటా ఎంట్రీ సక్రమంగా చేయకుంటే ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రతిరోజు కొనుగోలు చేసిన దాన్యం వివరాలను ట్యాబ్ లో నమోదు చేయాలని చెప్పారు. ఎలాంటి తప్పులు లేకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం త్వరలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎలాంటి సందేహాలున్న అధికారులు, రైతులు కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వసతి కల్పించాలని సూచించారు.
రైతులకు అవసరమైన గన్ని బ్యాగులు, టార్పలిన్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఎస్‌ఓ పద్మ, జిల్లా సహకార అధికారిని వసంత, ఐకెపిడీపీఎం రమేష్ బాబు, సహకార సంఘాల కార్యదర్శిలు, ఆపరేటర్లు పాల్గొన్నారు.