కామారెడ్డి, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని వర్గాల ప్రజలకు చేరువకు ఇప్పటికే వివిధ రకాల సేవలను విస్తృతం చేసిన తపాల శాఖ ఇటీవలే పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచడంతోపాటు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రత్యేకంగా ‘‘మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్ 2023’’ పేరిట కొత్త స్కీం ప్రవేశపెటింది.
గత మార్చి 31న ప్రవేశపెట్టిన స్కీమ్‌ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ కోరారు. మహిళల సమాన్ సేవింగ్ ఖాతాను ఓపెన్ చేసుకోవాలని, వారి పేరిట మైనర్ బాలికలు కూడా ఓపెన్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఖాతా కొరకు రూ. వెయ్యి మొదలుకొని రెండు లక్షల వరకు జమ చేసుకోవచ్చని డిపాజిట్‌పై 7.5% వడ్డీ వస్తుందని తెలిపారు. ఇంకా పూర్తి వివరాల కోసం దగ్గరలోని పోస్టాఫీస్‌ని సంప్రదించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు పోస్టాఫీస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తపాల శాఖ ఇన్స్పెక్టర్ కోరారు.