నిజామాబాద్, ఏప్రిల్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా వివిధ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు సూచించారు. బుధవారం జెడ్పి చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఎజెండాలోని వివిధ అంశాలపై చర్చ జరుగగా, వ్యవసాయ, అనుబంధ శాఖల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు. ఇప్పుడిప్పుడే వరి కోతలు ముమ్మరం అవుతున్నాయని, 11.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ, రైతులు ఏ దశలోనూ నష్టపోకుండా గట్టి చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అదేవిధంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం అందేలా పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ద్వారా గ్రామ సీమలు పచ్చదనం- పరిశుభ్రతను సంతరించుకుంటున్నాయని అన్నారు. ఫలితంగా జాతీయస్థాయిలో తెలంగాణకు వరుస అవార్డులు వరిస్తున్నాయని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై గ్రామాలను మరింతగా అభివృద్ధి బాట పట్టించేలా కృషి చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కోరారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ధాన్యం సేకరణ కోసం జిల్లా వ్యాప్తంగా 467 కొనుగోలు కేంద్రాలు నెలకొల్పి, 9లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
కడ్తా, తరుగు పేరుతో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని సభ్యులకు భరోసా కల్పించారు. నాణ్యత ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని జెడ్పి సభ్యులను కోరారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో గత డిసెంబర్ 2021, జనవరి 2022లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతాంగానికి ప్రభుత్వం తరఫున మంజూరైన నష్టపరిహారం పంపిణీ జరుగుతోందన్నారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాల తాకిడితో దెబ్బతిన్న పంటల వివరాలను కూడా ప్రభుత్వానికి పంపించామని వివరించారు. కొత్తపల్లి సహకార సంఘంలో అవినీతి అక్రమాలు జరిగాయని సభ్యులు ఆరోపించగా, సమగ్ర విచారణ జరిపిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇసుక, మొరం తవ్వకాల ద్వారా సమకూరే సీనరేజీ నిధులను నిబంధనల మేరకు స్థానిక సంస్థలకు కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఉపాధి హామీ పనులను రైతులకు ఉపయుక్తంగా ఉండేలా చేపట్టాలని, చెడిపోయిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించాలని, విరివిగా పండ్ల మొక్కలు నాటించాలని సభ్యులు సమావేశంలో కోరారు. అంతకుముందు జెడ్పి కార్యాలయ స్థలంలో సుమారు 87 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన వ్యాపార సముదాయాన్ని జెడ్పి చైర్మన్, కలెక్టర్, మేయర్ నీతూకిరణ్ లు లాంఛనంగా ప్రారంభించారు.
సమావేశంలో జెడ్పి సీఈఓ గోవింద్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఆయా మండలాల జెడ్పిటిసిలు, ఎంపీపీలు పాల్గొన్నారు.